ఉరి శిక్షలకు వ్యతిరేకంగా తన గళాన్ని దేశం అంతా వినిపించిన మన హక్కుల పోరాట యోధుడు, ప్రముఖ న్యాయవాది చంద్రశేఖర్ కన్నుమూశారు. కొంతకాలంగా కాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చంద్రశేఖర్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1991 ఆగస్టు ఆరో తేదీన గుంటూరు జిల్లా చుండూరు లో జరిగిన అగ్రవర్ణాల దాడుల్లో ఎనిమిది దళితులు ఊచకోతకు గురైన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. చుండూరు కేసులో దళిత నాయకులను, బాధితులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసినా, దశాబ్ధానికి పైగా వారి మద్దతుగా పోరాడి, చివరిదాకా వారికి వెన్నంటి నిలిచి దోషులకు శిక్షపడేలాగా చేసిన నిఖార్సైన న్యాయవాది చంద్రశేఖర్. న్యాయవాదరంగంలో త్వాత్వికంగా కృషి చేస్తున్న నిత్య కృషీవలుడు. సాహిత్య రంగంలో మంచి విమర్శకుడిగా, హక్కుల ఉద్యమానికి ఊపిరిగా పేరుగాంచిన చంద్రశేఖర్ చిన్నవయసులోనే మరణించడం అనేకమందికి తీరనిలోటు. చంద్రశేఖర్ ప్రముఖ పౌర హక్కుల నేత, కన్నబీరన్ కు ప్రియ శిష్యుడు. చంద్రశేఖర్ అంత్యక్రియలు బుధవారం గుంటూరులో జరుగుతాయి. చంద్రశేఖర్ మృతిపట్ల మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తోపాటు ప్రముఖ పౌరహక్కుల సంఘం నేతలు వరవరరావు తదితరులు సంతాపం ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: