హైదరాబాద్: తెలంగాణపై తాడోపేడో తేల్చుకోవడానికి ఆఖరి ప్రయత్నంగా టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఢిల్లీ వెళ్లి 20రోజులు కావస్తోంది. తెలంగాణపై కేంద్రం 2009డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలంటూ తెలంగాణ పొలిటికల్ జేఏసీ తలపెట్టిన తెలంగాణ మార్చ్ కు కేవలం 6రోజులు మాత్రమే మిగిలింది. దీనితో సర్వత్రా టెన్షన్ నెలకొంది. కేంద్రం అనుకూలంగా ప్రకటన చేస్తుందా? చేయదా? చేస్తే సంబరాలంటున్నారు. చేయకపోతే యుద్ధమేననీ అంటున్నారు తెలంగాణవాదులు. అయితే, తెలంగాణపై కేంద్రం అనుకూలంగా ఉందనీ, కేసీఆర్ ఢిల్లీలో ఇదే పనిలో ఉన్నట్లు గులాబీ దండు చెబుతోంది. 20రోజులుగా ఢిల్లీలో ఉంటున్న కేసీఆర్ ఇప్పటి వరకు కాంగ్రెస్ సీనియర్ నేత వాయలార్ రవి, ఆస్కార్ ఫెర్నండేజ్, సీపీఐ నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డిని మాత్రమే కలిసినట్లు చూశాం. వాయలార్ రవిని రెండుమార్లు కలిశారు. ఇక ఎవర్ని కలిసిన దాఖలాలు మాత్రం లేవు. గులాబీదండు మాత్రం ఢిల్లీలో మకాం వేసిన కేసీఆర్ చేయనీ ప్రయత్నమంటూ ఏదీ లేదనీ చెబుతోంది. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై తమకు ఎలాంటి సమాచారం లేదనీ టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం అంటున్నారు. అంతేకాకుండా, తెలంగాణపై కేంద్రంలో కదలిక వచ్చిందంటూ జరుగుతున్న ప్రచారమంతా పుకార్లుగా కోదండరాం అభిప్రాయపడుతున్నారు. తెలంగాణపై రోడ్ మ్యాప్ ప్రకటించినా కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ను విలీనం చేసేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదనీ వాయలార్ రవి, ఆస్కార్ ఫెర్నాండేజ్ ని కలిసిన సందర్భంలో కేసీఆర్ చెప్పారట. తెలంగాణ మార్చ్ లోగా కేంద్రంతో ప్రకటన చేయించేందుకుగానూ కేసీఆర్ నానా తంటాలు పడుతున్నారు. కానీ, ఇప్పటి వరకు కేసీఆర్ ఆశించినంత స్థాయిలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నుంచీ సిగ్నల్స్ రావడం లేదనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కేసీఆర్ తో సంప్రదింపులు జరుపుతున్న వాయలార్ రవి మాత్రం తెలంగాణపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదనీ, టీఆర్ఎస్ విలీనంపై కూడా ఇంకా ఏమీ మాట్లాడలేదంటున్నారు. టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం తెలంగాణపై కేంద్రం ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చిందనీ ప్రకటన వెలువడటమే తరువాయి అన్నట్లుగా చెప్పుకుంటోంది. వాస్తవ పరిస్థితులు మాత్రం ఆ విధంగా కనిపించడం లేదు. ఇటీవల తెలంగాణ ఉద్యమం కొత్త పుంతలు తొక్కిన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్లుగా టిఆర్ఎస్ తెలంగాణ సాధన పేటెంట్‌గా ఉండిపోయింది. తెలంగాణ అంటే కెసిఆర్ - కెసిఆర్ అంటే తెలంగాణ అన్న విధంగా మారిపోయింది. అయితే ఇటీవల ఉద్యమం తీవ్రమవుతున్న ద్రుష్ట్యా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేసీఆర్ వాయిదా వేసుకోవాలనీ చెబుతున్న తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఈ నెల 30న తెలంగాణ మార్చ్ ను నిర్వహిస్తోంది. కేసీఆర్కు ఈ మార్చ్ ఇంట్రస్టు లేదు. అయితే, విధిలేని పరిస్థితుల్లో మద్దతు ఇస్తోంది. కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు బహిరంగంగా మద్దతును ప్రకటించలేదు. తెలంగాణ మార్చ్ కు కేవలం 6రోజుల వ్యవధి మిగలడంతో కేంద్రం ఏం చేయబోతోంది? కేసీఆర్ ఏం చేయబోతున్నాడు? అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: