లేఖ తెలుగుదేశం పార్టీలో దుమారం లేపింది. ఇష్టం లేకున్న రాసిన ‘చంద్ర’లేఖ ఇప్పుడు కష్టపెడుతోంది. అయినా అధినేత దానిని అంతగా పట్టించుకోవడం లేదు. దీంతో లేచిన దుమారంపై అనుమానం కలుగుతోంది. తెలంగాణపై చంద్రబాబు ప్రధానికి లేఖరాసారు. దీనికి ముందు ఇరుప్రాంతాల నేతలతో భారి కసరత్తు చేశారు. అంతా అయ్యాక రాసిన లేఖ ఎందుకు సీమ తమ్ముళ్లను చింతకు గురిచేసింది అన్నదే అందరి మదిలో కలుగుతున్న అనుమానం. రాజకీయాల్లో ఆరితేరిన చంద్రబాబు ఇంత పొరపాటు చేయరని, ఈలొల్లి వెనుక ఆయనే అసలు చక్రం తిప్పుతున్నారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నవారు లేకపోలేదు. ఈఅనుమానాలు రావడానికి కారణం ఉంది. మొదట లేఖ ఇచ్చినప్పుడు ఏతమ్ముడు ఏమనలేదు. పైగా అప్పుడు తెలంగాణకు అనుకూలమని లేఖ రాసారు. ఇప్పుడు తెలంగాణకు అనుకూలమని ఎక్కడా రాయలేదు. అఖిలపక్షం పెట్టండి, తెలంగాణపై తేల్చండి అని మాత్రమే లేఖ రాస్తే ఇంత రాద్దాంతం ఎందుకు. అందుకే చంద్రబాబు చాణక్యనీతి తెలిసిన వారంతా ఇదో డ్రామా అని అంటున్నారు. రాజీనామా చేసిన బైరెడ్డితో పాటు ఆబాటలో నడుస్తున్న ప్రవీణ్ రెడ్డి,అమర్ నాథ్ రెడ్డిల అలకకు కారణాలు ఏం చెపుతున్నారు. లేఖపై వారికి ఎలాంటి అభ్యంతరం లేదట. అందులో సీమ గూర్చి ప్రస్తావించక పోవడమే చంద్రబాబు చేసిన తప్పట. దీనికోసం పార్టీని వీడేంత పనేముంది. పైగా వారు తెలంగాణకు మద్దతిస్తారట, రాయలసీమ ఉద్యమానికి తెలంగాణ వారి సహకారం కావాలట. అంటే చేయిచాస్తూనే చేయూతనిచ్చేందుకు చంద్రుడు చేసిన పనిని తప్పు పట్టడం వెనుక సీమ తమ్ముళ్ల అసలు వ్యవహారం ఏదో ఉన్నట్టే కదా. రేపు తెలంగాణ వస్తే చంద్రబాబు సీమవాసి అవుతారు కాని తెలంగాణ వాసి కారు కదా. అలాంటప్పుడు సీమ ప్రయోజనాలకు బాబు ఎందుకు భంగం కల్పిస్తారు. ఇదంతా తెలిసినవారు ఇప్పుడు చంద్రలేఖను అడ్డం పెట్టుకుని లేపుతున్న దుమారం అసలు సమస్యను పక్కతోవ పట్టించడానికే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: