తెలంగాణ అంశంపై అధిష్టానం ఫైనల్ గా ఓ నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఆ కీలక సమాచారం ఆ కాంగ్రెస్ నాయకులకు లీక్ అయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంత నేతల మధ్య మాటల తూటాలు.. హితవులు, సూచనలు, బుజ్జగింపులూ నడుస్తున్నాయి. విభజనపై కేంద్రం సానుకూల నిర్ణయానికి వచ్చేసిందని తెలుస్తోంది. తాజాగా ఆ పార్టీ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. 'కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది' అనే ప్రాతిపదికనే అన్ని ప్రాంతాల వారి ప్రకటనలు, స్పందనలు, సమావేశాలు జరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. 'రాష్ట్ర విభజన జరగదు, జరగబోదు' అని నిన్నమొన్నటి వరకు కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన మంత్రి టీజీ వెంకటేశ్... 'తెలంగాణ ఇచ్చే అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయి' అన్నారు. ఎప్పుడూ నవ్వుతూ, వ్యంగ్యాస్త్రాలు సంధించే ఆయన నిరాశగా, నీరసంగా కనిపిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల వాదనను తిప్పికొట్టలేకపోయామని, ఆ శక్తి తమకు లేకపోయిందని వాపోయారు. ఇక.. టీ-కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా సంకేతాలున్నాయని ప్రకటించారు. విభజన విషయం ఫైనల్ స్టేజీకి చేరిందంటున్నారు. తెలంగాణ ప్రాంత సీనియర్ నేత, మంత్రి జానారెడ్డి సమస్య పరిష్కారమైనట్లేనంటూ అధిష్ఠానానికి ధన్యవాదాలు చెప్పేలా ప్రకటనలు మొదలుపెట్టారు. దీంతో రాష్ట్రంలో విభజన రాజకీయం మరింత వేడెక్కింది. అందరిలోనూ టెన్షన్.. టెన్షన్.. తెలంగాణపై తేల్చేందుకు సన్నాహాలు మొదలయ్యాయని వస్తున్న సిగ్నల్స్ నేపథ్యంలో... అటు హైదరాబాద్ నగర మంత్రులు, ఇటు రాయలసీమ నేతలు స్వరం పెంచుతున్నారు. హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రం చేయాలంటూ మంత్రులు దానం నాగేందర్, ముఖేశ్ గౌడ్ డిమాండ్ చేయగా... సీమ నీటి కష్టాల గురించి ఏరాసు ప్రతాపరెడ్డి ఏకరువు పెట్టారు. 'మాకు అన్యాయం జరిగితే ఊరుకోం' అనే సంకేతాలు పంపారు. మరోవైపు రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హఠాత్తుగా 'జై ఆంధ్ర' ఉద్యమాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చి కలకలం సృష్టిస్తున్నారు. మొత్తమ్మీద తెలంగాణ అంశం చివరి ఎపిసోడ్ కు చేరుకుంది. మరో పది రోజుల్లోనే కేంద్ర చరిత్రాత్మక ప్రకటన చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టినట్టే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: