విశ్వరూపం సినిమా విషయంపై సతమతవుతున్న కమల్‌హాసన్‌కు మద్దతు పెరుగుతోంది. తమిళనాడును విడిచిపోతానన్న కమల్‌హాసన్‌ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సినీరాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున కోరుతూ ఆయనకు అండగా నిలబడుతున్నారు. ఒకప్పటి స్టార్, డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్‌, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కమల్‌కు ఓదార్పునిస్తున్నారు. సినిమా రంగానికే తన జీవితాన్ని కొనసాగిస్తున్న కమల్‌ను క్షోభపెట్టటం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని విజయకాంత్‌ మండిపడ్డారు. రజనీకాంత్‌ కూడా కమల్‌హాసన్‌ను దేశం వదిలిపోతానన్న నిర్ణయాన్ని మార్చుకోవాలని ఫోన్‌ ద్వారా సంప్రదించినట్టు చెన్నై వర్గాల సమాచారం. కమల్ కోసం.. తమిళ సినీ ప్రముఖులు భారతీరాజా, మణిరత్నం, శివకుమార్‌, అరవింద్‌స్వామి, కార్తీ, సూర్య, శింబు, రాధిక.. పలువురు కమల్‌ ఇంటికి వెళ్లి ఆయన్ను ఓదార్చారు. అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుని, తన నిర్ణయాన్ని మార్చుకోవాలని నినాదాలు చేశారు. కమల్ వెళ్లిపోతే, తాము కూడా ఆయనవెంటే వెళ్లిపోతామని ఆవేశంగా మాట్లాడారు. అభిమానుల ఆగ్రహం తీవ్రరూపం దాల్చుతుండడంతో కమల్ స్వయంగా రంగంలో దిగి అభిమానులతో మాట్లాడారు. బుధవారం రాత్రి ఆయన అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ, ముస్లిం సోదరులతో చర్చలు జరిపి పరస్పర అంగీకారానికి ప్రయత్నిస్తున్నామని, అభిమానులు ఆవేశపడకుండా ప్రశాంతంగా వుండాలని సూచించారు. న్యాయస్థానం తీర్పును గౌరవించాల్సిందేనని, అభిమానుల తరపున తానే పోరాడుతానని ఫ్యాన్స్ కు సర్ధి చెప్పారు. భారతీయ సినిమా ఏడ్చిన రోజు.. విశ్వరూపం కష్టాలపై టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి స్పందించారు. ఈ రోజు భారతీయ సినిమా ఏడ్చిన రోజు. ఇటువంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఇది చాలా బాధాకరం. రేపిస్టులకు - గివెన్ ఎ చాన్స్... కళాకారులకు - నిషేదం-శిక్షలు.. ఇండియాలోలో సెక్యూలరిజం అంటే ఇదేనా? మేము కమల్ కు మద్దతు పలుకుతున్నాం.. మీరు...? అంటూ రాజమౌళి తన ఫేస్‌బుక్ లో రాశారు. సినీ సంఘీభావం సెన్సార్‌బోర్డు అధ్యక్షులు లీలా శామ్సన్‌, సినీ ప్రముఖులు నాగార్జున, శ్యాంబెనగల్‌, మహేశ్‌భట్‌, షారుఖ్‌ఖాన్‌, సిద్ధార్థ్‌, ప్రకాష్‌రాజ్‌, మాధవన్‌, నాని తదితరులు సంఘీభావం ప్రకటించారు. కమల్‌హాసన్‌కు కేంద్రప్రభుత్వం కూడా అండగా నిలిచింది. దేశంలో ప్రతి ఒక్కరూ భావప్రకటనా స్వేచ్ఛను కలిగిఉన్నారనీ, కళాకారులు తమకు నచ్చిన పనిచేసుకోవడంలో స్వేచ్ఛను కలిగి ఉన్నారని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: