కాంగ్రెస్ పార్టీ యువనేత, ఏఐసిసి ఉపాధ్యక్షుడు, సోనియాగాంధీ కుమారుడు రాహూల్ గాంధీకి దగ్గర కావడం కోసం రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు ఉవ్విళ్లురుతున్నారు. ఇందులోభాగంగా కొంతమంది నాయకులు తరచూ ఢిల్లీకి వెళ్లి కలిసి రావడం కోసం, రాహూల్ దృష్టిలో పడడం కోసం ప్రయత్నిస్తున్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు ఎంపీలు, మంత్రులు రాహూల్ గాంధీ వద్ద లాబీయింగ్ చేస్తూ రాష్ట్రం విడిపోకుండా చూడాలని రాహూల్ గాంధీని వేడుకుంటుండగా, తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంతమంది నేతలు రాహూల్ గాంధీకి దగ్గరకావడం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే మధుయాష్కి, సుధాకర్ రెడ్డి తదితరులు రాహూల్ గాంధీతో భేటీ అయినట్లుగా తెలుస్తుంది. తెలంగాణ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని రాహూల్ ను కోరినట్లుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతున్నటువంటి బలిదానాలను ఆపాలంటే తెలంగాణ ఇవ్వడం ఒక్కటే మార్గమని కొంతమంది తెలంగాణ ప్రాంత నాయకులు రాహూల్ గాంధీతో విన్నవించినట్లుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ఎంపీ, అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పినట్లుగా తెలుస్తుంది. కాగా ఇకనుండి కాంగ్రెస్ పార్టీలో రాహూల్ గాంధీయే కీలకం అవుతున్నందున అతని దృష్టిలో పడితే, ఇక తమతో బేష్ అనిపించుకుంటే భవిష్యత్తులో తమకు డోకా ఉండదనే ముందుచూపుతో కొంతమంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం నాయకులు ఈ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: